HRD ministry: నాలుగేళ్లలో డిగ్రీతో పాటే బీఈడీ.. కొత్త కోర్సుకు ముసాయిదా తయారు!
- బీఏ లేదా బీఎస్సీతో పాటే బీఈడీకి కసరత్తు
- నిబద్ధత ఉన్న అభ్యర్థులకే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం
- మరింత ప్రాక్టికల్‌గా కొత్త కోర్సు రూపకల్పన
బీఏ లేదా బీఎస్సీ లాంటి డిగ్రీ కోర్సులతో పాటే బీఈడీ పూర్తి చేసేలా ఓ సరికొత్త కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ( హెచ్ఆర్డీ) కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. డిగ్రీ తర్వాత బీఈడీ కోర్సు చేయడానికి ప్రస్తుతం రెండేళ్లు పడుతోంది. అయితే ఇంజనీరింగ్, వైద్య విద్యలో మాదిరిగా నిబద్ధత, పట్టుదల ఉన్న అభ్యర్థులకు మాత్రమే ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు హెచ్ఆర్డీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతమున్న రెండేళ్ల బీఈడీ కోర్సును నాలుగేళ్ల ఇంటెగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌గా మార్చనున్నారు. ఈ ప్రతిపాదనపై కసరత్తు చేయాలంటూ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి హెచ్ఆర్డీ ఇప్పటికే ఓ లేఖ రాసింది.
ఇదే ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా తమ బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కోర్సు మరింత ప్రాక్టికల్‌గా ఉండేలా రూపొందనుందని ఎన్సీటీఈ వర్గాలు తెలిపాయి. కాగా, డిగ్రీ తర్వాత రెండేళ్ల బీఈడీ కోర్సు, ఏడాది కోర్సును తీసివేయడం, ఇంటర్ తర్వాత నాలుగేళ్ల సమీకృత కోర్సును ప్రవేశపెట్టడం సహా ఉపాధ్యాయ శిక్షణా కోర్సుల కోసం ఎన్సీటీఈ కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. కాగా, ఈ కొత్త కోర్సుకు సంబంధించి ఎన్సీటీఈ తన ముసాయిదా ప్రతిపాదనను ఈ ఏడాది మార్చి కల్లా నివేదించనుందని హెచ్ఆర్డీ వర్గాలు తెలిపాయి. మార్చి, 2016 నాటికి దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులో చేరినట్టు లెక్కతేలగా, వీరిలో కేవలం నాలుగు వేలమంది మాత్రమే ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అయ్యారు.