Pawan Kalyan: రఘువీరాకు ఫోన్ చేసి 'మీ సహాయం మాకు కావాలి' అన్న పవన్... తాను రాలేనని చెప్పిన కాంగ్రెస్ నేత
- ఈ ఉదయం మరోసారి ఫోన్ చేసిన పవన్ కల్యాణ్
- జేఎఫ్సీ సమావేశానికి రావాలని ఆహ్వానం
- ఆయన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన రఘువీరా
- ప్రతినిధులను పంపుతానని వెల్లడి
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డికి ఫోన్ చేసినప్పటికీ, ఆయన లైన్లోకి రాకపోవడంతో మాట్లాడలేకపోయిన జనసేన అధినేత పవన్, ఈ ఉదయం ఆయనకు మరోసారి ఫోన్ చేశారు. తాను ఏర్పాటు చేయదలచిన జేఎఫ్సీకి కాంగ్రెస్ మద్దతివ్వాలని కోరుతూ, రేపు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో జరగనున్న సమావేశానికి హాజరు కావాలని కోరారు. అయితే, దీనిని రఘువీరారెడ్డి సున్నితంగా తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే, సమావేశానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ లను పంపుతానని పవన్ కు రఘువీరారెడ్డి వెల్లడించినట్టు పేర్కొంది. కాగా, ఈ కార్యక్రమానికి లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు హాజరు కానున్నారన్న సంగతి తెలిసిందే. ఏపీకి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై ఈ సమావేశం జరగనుంది.