Communist Party of India (Marxist): గర్భవతిని కడుపులో తన్నిన సీపీఎం నేత... అబార్షన్!
- భర్తపై దాడిని అడ్డుకునే ప్రయత్నంలో ఘటన
- రక్తస్రావం....నాలుగు నెలల గర్భస్థ శిశువు మరణం
- ఓ నిందితుడి అరెస్ట్..పరారీలో ప్రధాన నిందితుడు
- తమ నేతకు సంబంధం లేదంటోన్న కార్యకర్తలు
కేరళలోని కోజికోడ్‌లో ఓ సీపీఎం నాయకుడు కడుపులో తన్నడంతో ఒక మహిళకు గర్భస్రావమయింది. ఈ ఘటన గురించి పోలీసులు అందించిన వివరాల్లోకెళితే... 30 ఏళ్ల బాధిత మహిళ దాడికి గురయినప్పుడు తను నాలుగు నెలల గర్భవతి. తన భర్తకు, పొరుగింటి వ్యక్తికి మధ్య మాటామాటా పెరిగినపుడు బాధితురాలు జోక్యం చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు తన భర్తపై దాడికి దిగినప్పుడు ఆమె అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో దాడికి దిగిన వ్యక్తుల్లో ఒకరైన స్థానిక సీపీఎం నేత ఆమెను కడుపులో తన్నాడు. వెంటనే ఆమెకు తీవ్ర రక్త స్రావం జరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు ఆమెకు అబార్షన్ చేశారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. తన భర్తపై దాడి చేసిన వారిలో ఒకరు స్థానిక సీపీఎం నేత అని, అయితే అతని పేరు వెల్లడించవద్దని సీపీఎం కార్యకర్తల నుంచి తమపై ఒత్తిడి వస్తోందని, కేసును ఉపసంహరించుకోవాలని కూడా వారు బెదిరిస్తున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడి తీరుతామని స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే, ఈ ఘటనతో తమ నాయకుడికి ఎలాంటి సంబంధమూ లేదని సీపీఎం కార్యకర్తలు చెప్పడం గమనార్హం.