jc diwakar reddy: వారిని దెబ్బతీసేందుకు రాజీనామా చేస్తానన్నా... చంద్రబాబు ఒప్పుకోలేదు: జేసీ దివాకర్ రెడ్డి
- రాష్ట్రాన్ని మోదీ మోసం చేశారు
- కేసుల నుంచి బయటపడేందుకు జగన్ తంటాలు పడుతున్నారు
- మోదీ, జగన్ లను దెబ్బతీసేందుకు రాజీనామా చేస్తానని చెప్పా
ఏపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రూ. 10 కోట్ల విలువ చేసే రైల్వే జోన్ నే ఇవ్వలేని మోదీ... రాష్ట్రానికి ఇంకేం చేస్తారని ప్రశ్నించారు. వాస్తవానికి రైల్వే జోన్ వల్ల ఏపీకి వచ్చేదేమీ లేదని చెప్పారు. రాష్ట్రానికి మోదీ మోసం చేశారని... మోదీని నమ్మి చంద్రబాబు మోసపోయారని తెలిపారు. బీజేపీ తీరు దారుణంగా ఉందని... ఆ పార్టీ పేరు చెబితేనే తనకు ఒళ్లు మండుతోందని అన్నారు. బీజేపీతో స్నేహం టీడీపీకి అవసరం లేదని... కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ పార్టీతో మరికొంత కాలం కలిసి ఉండాల్సిఉందని చెప్పారు. చంద్రబాబును చూసి మోదీ భయపడినట్టున్నారని... చంద్రబాబు ఎదిగితే తనకు ప్రమాదమని మోదీ భావించి ఉండవచ్చని అన్నారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
బీజేపీతో చేయి కలిపేందుకు వైసీపీ అధినేత జగన్ నానా ప్రయత్నాలు చేస్తున్నారని... అయినా జగన్ తో చేయి కలిపేందుకు బీజేపీ ఇష్టపడదని జేసీ చెప్పారు. మోదీ, జగన్ లను దెబ్బతీసేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని... కానీ, చంద్రబాబు అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఎంపీల రాజీనామా పేరుతో జగన్ మళ్లీ డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు. ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని రెండేళ్ల క్రితం చెప్పిన జగన్... ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత... ఇక ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదనే ధైర్యంతోనే మళ్లీ రాజీనామాల డ్రామాను స్టార్ట్ చేశారని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి బయటపడటం, శిక్ష నుంచి తప్పించుకోవడానికి జగన్ పాట్లు పడుతున్నారని అన్నారు. జగన్ ను చిన్నప్పటి నుంచీ చూశాను కాబట్టే 'వాడు' అని సంబోధిస్తుంటానని... ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని చెప్పారు.