railways: ముంబై-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో మెరుగైన సౌకర్యాలు!
- ప్రధాన మార్గాల్లో పయనించే రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లలో మెరుగైన సౌకర్యాలు
- ఆపరేషన్ ‘స్వర్ణ్’లో భాగంగా పనులు ప్రారంభం
- ఒక్కో రైలుకు రూ.50 లక్షలను ఖర్చు చేస్తాయన్న అధికారి
ముంబై - ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ మరింత అందంగా, మరిన్ని సౌకర్యాలతో ప్రయాణికులను అలరించనుంది. ముంబై, ఢిల్లీ రెండు ప్రధాన నగరాల మధ్య తిరిగే రాజధాని ఎక్స్ ప్రెస్ బోగీలను అందంగా తీర్చిదిద్ది, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు రైల్వేశాఖ పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా వెస్ట్రన్ రైల్వే స్ సీపీఆర్వో రవీందర్ భాకర్ మాట్లాడుతూ, ఆపరేషన్ ‘స్వర్ణ్’లో భాగంగా ప్రధాన మార్గాల్లో పయనించే రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ వంటి ముఖ్యమైన రైళ్లలో సౌకర్యాలను మరింతగా మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు.
ఈ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఒక్కో రైలుకు రూ.50 లక్షలను ఆయా రైల్వే డివిజన్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. భద్రత, సమయపాలన, పరిశుభ్రత, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు వంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని ఆయా రైళ్లలో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ ఆనందించదగ్గ విషయమేంటంటే, ఎక్కువ ఛార్జీలు లేకుండానే అదనపు సౌకర్యాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
ముంబై - రాజధాని ఎక్స్ ప్రెస్ లో వినైల్ యాంటీ-గ్రాఫిటీతో తయారు చేసిన విండోస్, వాటిపై అందమైన పెయింటింగ్స్, ఎల్ ఈ డీ లైట్స్, మెరుగైన బెర్తులు, వాష్ బేసిన్స్, టాయిలెట్స్ లో నాణ్యత కలిగిన బేసిన్స్, టాయిలెట్ పేపర్ డిస్పెన్సర్స్, సోప్స్, తదితర సౌకర్యాలను మెరుగైన రీతిలో అందించనున్నారు. బోగీలను అందంగా తీర్చిదిద్దేందుకు ఇంకా చేపడుతున్న చర్యల గురించి చెప్పాలంటే.. నాణ్యత కలిగిన అద్దాలు, ప్రయాణికులు కూర్చునే స్థలం మరింత పరిశుభ్రంగా, ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీలలో కొత్త డిజైన్లలో కర్టెన్స్, ఉష్ణోగ్రత, తేమ శాతం ఎంత ఉందో తెలియజేసే డిజిటల్ వాచెస్ ను ఏర్పాటు చేస్తున్నారు.