Telangana: తెలంగాణకు అదనపు నిధులు కేటాయించాలని జైట్లీని కోరిన కేసీఆర్
- బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలి
- తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం సాయం చేయాలి
- కేంద్రమంత్రి జైట్లీని కలిసి విన్నవించిన సీఎం కేసీఆర్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్, ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కలిసి జైట్లీని కలిశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని, రైతులకు సాగు నిమిత్తం ఎకరాకు రూ. 4 వేలు ఇస్తున్నామని, ఇందుకోసం బ్యాంకుల్లో నగదును అందుబాటులో ఉంచాలని జైట్లీకి కేసీఆర్ విన్నవించారు.
తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని, తమ రాష్ట్రంలో 9 జిల్లాలను వెనుకబడినవిగా గుర్తించడంపై జైట్లీకి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. 2014-17 వరకు రూ.1.350 కోట్లు విడుదల చేశారని, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు ఇంకా రాలేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతూ జైట్లీకి కేసీఆర్ ఓ నివేదిక సమర్పించారు.