TTD: మరో వివాదంలో టీటీడీ ప్రధానార్చకుడు... రమణ దీక్షితులుపై విచారణ మొదలు!
- కర్ణాటకలోని మాండ్యాలో స్వామివారి కల్యాణోత్సవం
- నిబంధనలకు విరుద్ధంగా దగ్గరుండి జరిపించిన రమణ దీక్షితులు
- విచారణకు ఆదేశించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు, నిత్యమూ శ్రీవారి సేవలో నిమగ్నుడయ్యే రమణ దీక్షితులు మరో వివాదంలో చిక్కుకోగా, ఆయనపై టీటీడీ విచారణ ప్రారంభమైంది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం, ప్రధానార్చకులు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఆయన తన పెద్ద కుమారుడు వెంకటపతి దీక్షితులుతో కలసి కర్ణాటకలోని మాండ్యాలో ఈనెల 10వ తేదీన జరిగిన ఓ ప్రైవేటు కల్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి వివాహ తంతును దగ్గరుండి జరిపించారు.
అదే రోజు హైదరాబాద్ టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన కల్యాణోత్సవానికి ఆయన డుమ్మా కొట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై టీటీడీ విచారణకు ఆదేశించింది. రెండేళ్లుగా తిరుమలలో వెంకటపతి దీక్షితులు ఎటువంటి విధులకూ హాజరు కాకపోవడం, ఆయన్ను తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయానికి బదిలీ చేసినా, ఇంతవరకూ విధుల్లోకి చేరకపోవడంపైనా టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.