Nirav Modi: నీరవ్ మోదీని వదిలించుకోవడం ఎలా? ఆలోచనలో పడిన ప్రియాంకా చోప్రా!
- బ్యాంకులకు వేల కోట్లను ఎగ్గొట్టిన నీరవ్ మోదీ
- ఆయనతో జనవరి 2017 నుంచి ప్రియాంకా చోప్రా డీల్
- కుంభకోణం వెలుగులోకి రావడంతో న్యాయ నిపుణుల సలహా కోరిన ప్రియాంక
బ్యాంకులకు రూ. 11 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి, జనవరి 1న దేశాన్ని విడిచి పారిపోయిన నీరవ్ మోదీతో బ్రాండ్ అంబాసిడర్ డీల్ కుదుర్చుకుని, ఆయన సంస్థ 'నీరవ్ మోదీ' డిజైనర్ ఆభరణాల ప్రచారకర్తగా ఉన్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా, ఇప్పుడా డీల్ ను రద్దు చేసుకునే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. 'నీరవ్ మోదీ' సంస్థతో గతంలో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఎలా రద్దు చేసుకోవాలన్న విషయంలో ప్రియాంక న్యాయ నిపుణుల సలహాలను కోరుతోందని, ఆమె తరఫు ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
"నీరవ్ మోదీపై ప్రియాంకా చోప్రా దావా వేసిందని, కేసు పెట్టిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. ఇదే సమయంలో ఆమె గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఎలా వదిలించుకోవాలో ప్రయత్నిస్తున్నారు. లాయర్ల సలహాను ఇప్పటికే కోరారు. నీరవ్ పై ఆర్థిక కుంభకోణం ఆరోపణలు రావడమే ఇందుకు కారణం" అని ఆ ప్రకటనలో ఉంది. కాగా, జనవరి 2017 నుంచి నీరవ్ మార్కెటింగ్ చేస్తున్న వివిధ రకాల ఆభరణాలకు ఈ 'క్వాంటికో' క్వీన్ ప్రచారం సాగిస్తోంది.