Tamilnadu: సుప్రీం తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: తమిళుల మండిపాటు
- నీటి వాటాలో కోతపై తమిళ సంఘాల స్పందన
- ఉన్న వాటా తగ్గించడంపై విమర్శలు
- 15 టీఎంసీలను తగ్గించిన సుప్రీంకోర్టు
ఈ ఉదయం కావేరీ నదీ జలాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము వ్యతిరేకిస్తున్నట్టు తమిళ సంఘాలు వెల్లడించాయి. ఎన్నో దశాబ్దాలుగా తమిళనాడు అనుభవిస్తున్న నీటి వాటాలో కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్న తమిళులు, రాష్ట్రంలో జనాభా సంఖ్య పెరుగుతుంటే, అదనంగా నీరు కేటాయించాల్సిన స్థితిలో, ఉన్న వాటాను తగ్గించడం ఏంటని మండిపడుతున్నారు.
సుప్రీంకోర్టు కేటాయించిన 177.25 టీఎంసీల నీరు వచ్చే పరిస్థితి కావేరీ నదిలో గత నాలుగేళ్లుగా లేదని చెబుతూ, ఎగువన ఉన్న కర్ణాటకకు నీటిలో వాటాను పెంచడం వల్ల వస్తున్న ఆ కొద్ది నీరు కూడా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు. 2007లో అప్పటి ట్రైబ్యునల్ తమిళనాడుకు 192 టీఎంసీలు, కర్ణాటకకు 184.75 టీఎంసీల నీటిని కేటాయించిన సంగతి తెలిసిందే.
కాగా, తమిళనాడు సర్కారు తమకు నాటి ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు 192 టీఎంసీల నీరు కావాలని సుప్రీంలో కోరితే, అందులో సుమారు 15 టీఎంసీలు తక్కువగా కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నట్టు కర్ణాటక సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యానించారు.