charan: 'రంగస్థలం'లో ఆసక్తిని రేపే రాజకీయ నేపథ్యం!
- గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం'
- ప్రేమకథతో పాటు రాజకీయాలు
- ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలు
గతంలో గ్రామీణ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి .. బలమైన కథాకథనాలతో కూడిన పల్లె అందాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ తరువాత చాలాకాలానికి సుకుమార్ గ్రామీణ నేపథ్యంలో 'రంగస్థలం' సినిమాను చేస్తున్నాడు. గోదావరిలో పడవ నడిపే చిట్టిబాబుగా చరణ్ నటిస్తుండగా, రామలక్ష్మి అనే పేదింటి పిల్లగా సమంత నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం .. దాని పర్యవసానాలతో ఈ సినిమా రూపొందుతుందని అంతా అనుకున్నారు.
అయితే ఈ ప్రేమకథతో పాటు బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఈ సినిమాలో ఉందనే టాక్ తాజాగా బయటికి వచ్చింది. 1985 నాటి రాజకీయాలు .. అవి చూపే ప్రభావాలు కథలో భాగంగా వస్తాయని అంటున్నారు. మండల స్థాయిలో జరిగే ఎన్నికలకి సంబంధించిన సన్నివేశాలు ఉత్కంఠను రేపేవిగా వుంటాయని చెబుతున్నారు. మార్చి 30వ తేదీన రానున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.