Tollywood: కేటీఆర్ కి నా కృతజ్ఞతలు.. అలాగే, నా విన్నపం..! : దర్శక - నిర్మాత తమ్మారెడ్డి
- చర్లపల్లి పాఠశాలలో సౌకర్యాల కల్పనకు ఆదేశించినందుకు ‘థ్యాంక్స్’
- ట్విట్టర్ లో ఎవరో చెబితే స్పందించడం కాదు!
- అన్ని పాఠశాలల్లో సౌకర్యాలను చెక్ చేయించాలని నా విన్నపం
- ‘నా ఆలోచన’లో తమ్మారెడ్డి భరద్వాజ
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం చర్లపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుస్థితిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ కు యాంకర్ ప్రదీప్ ట్వీట్ చేయడం..అందుకు, కేటీఆర్ సానుకూలంగా స్పందించడం తెలిసిందే. ఈ విషయమై ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ‘నా ఆలోచన’ ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కి ఆయన ‘థ్యాంక్స్’ చెప్పారు.
‘మోదీ గారి ప్రభుత్వం ‘శౌచాలయ్’కు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, పాఠశాలల్లో ఈ సౌకర్యాలు ఇంకా ఎందుకు కల్పించలేదు? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాగానే కృషి చేస్తున్నాయి. అయినా, యాంకర్ ప్రదీప్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సమస్య ప్రస్తావించే వరకు ఆ పాఠశాలలో సౌకర్యాల కల్పన ఎందుకు జరగలేదు? అంటే, పనులు జరిగినట్టు అకౌంట్స్ లో చూపిస్తున్నారే తప్పా, ఆ పనులు జరగట్లేదా? అనే అనుమానం తలెత్తుతోంది.
వెంటనే స్పందించినందుకు కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే, నా విన్నపం ఏంటంటే.. ట్విట్టర్ లో ఎవరో చెబితే స్పందించడం కాదు! అన్ని పాఠశాలల్లో చెక్ చేయించండి. పాఠశాలల్లో సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చాలా ఖర్చుపెట్టాయి. మిగతా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా? లేవా? అనే విషయమై గణాంకాలు తెప్పించుకుని చూస్తే బాగుంటుంది. ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను’ అంటూ తమ్మారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.