Hyderabad: హైదరాబాద్‌లో జరిగే టూరిజం కాంక్లేవ్ -2018కు ఏపీ మంత్రి అఖిలప్రియకు ఆహ్వానం
- అఖిల ప్రియను కలిసిన ఫ్యాప్సీ డైరెక్టర్
- హైదరాబాదులోని హోటల్ మారియట్ లో జూన్ 28 నుంచి 30 వరకు టూరిజం కాంక్లేవ్ -2018
- ఏపీ నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని తెలిపిన అఖిల ప్రియ
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియను తెలంగాణ ఫ్యాప్సీ ప్రతినిధులు హైదరాబాదుకు ఆహ్వానించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టూరిజం కాంక్లేవ్ -2018 కు అతిథిగా రావాలని కోరారు. ఫ్యాప్సీ డైరెక్టర్ పీ వైదేహి, టూరిజం కాంక్లేవ్-2018 ఛైర్మన్ వాల్మీకి హరికృష్ణ అమరావతి సచివాలయంలో మంత్రి అఖిల ప్రియను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందించారు.
హైదరాబాదులోని హోటల్ మారియట్ లో జూన్ 28 నుంచి 30 వరకు నిర్వహించే టూరిజం కాంక్లేవ్ -2018కు ఏపీ నుంచి అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక అభివృద్ధికి పరస్పర సహకారాన్ని కోరుతున్నామని డైరెక్టర్ వైదేహి వివరించారు. అలాగే వచ్చే సెప్టెంబరులో నిర్వహించే ఏపీ టూరిజం కాంక్లేవ్ కు తెలంగాణ నుంచి తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్పారు.
దీనిపై స్పందించిన మంత్రి అఖిలప్రియ.. పర్యాటక అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సమైక్య ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ టూరిజం కాంక్లేవ్ -2018కు ఏపీ నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని పేర్కొన్నారు.