Pawan Kalyan: జేఎఫ్సీ పై మాకు నమ్మకం లేదు!: బీజేపీ నేత నరసింహారావు
- హోదాను రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు చూస్తున్నారు
- హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ముందుకెళ్లాలి
- బురదజల్లుకోవడం సబబు కాదు: మీడియాతో నరసింహారావు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై నిజానిజాలు తేల్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ (జేఎఫ్ సీ)పై తమకు నమ్మకం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాను రాజకీయ అస్త్రంగా వాడుకునేందుకు చూస్తున్నారని, హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నామని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా ముందుకెళ్లాలి తప్ప, బురదజల్లుకోవడం సబబు కాదని, కేంద్రంలో అధికారంలో ఉన్న తాము హుందాగా వ్యవహరిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ గొంతు కోసిందని విమర్శించిన ఆయన, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణలకు సమానంగా పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును కేవలం హైదరాబాద్ లోనే కాకుండా, అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజలకు రెండు పార్టీలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.