Pawan Kalyan: ఇటువంటి ధోరణితో దేశ సమగ్రతకు చాలా భయంకరమైన సమస్య తలెత్తుతుంది: పవన్ కల్యాణ్
- ఏపీ విషయంలో మా వంతు పోరాటం చేస్తాం
- మాటిచ్చాక వాటిని అమలు చేయకపోతే ప్రజల్లో అశాంతి నెలకొంటుంది
- హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు
- విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ ప్రయత్నం తాము చేస్తామని, తమ ప్రయత్నాలు ఎంత మేరకు విజయవంతం అవుతాయో చూడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో జేఎఫ్‌సీ సమావేశం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ప్రభుత్వాలు మాటిచ్చాక వాటిని అమలు చేయకపోతే ప్రజల్లో అశాంతి నెలకొంటుందని అన్నారు.
ప్రజల్లో అశాంతి చెలరేగితే దేశం ముక్కలవుతుందని పవన్ హెచ్చరించారు. పాలకులు చేసిన తప్పులకి పేద ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. న్యాయం జరగనప్పుడు నా దేశంలో నేను ద్వితీయ శ్రేణి పౌరుడిని అనేలా పౌరుల్లో అసంతృప్తి నెలకొంటుందని అన్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో తాను బాధితులతో మాట్లాడినప్పుడు వారు తీవ్రతరంగా పోరాడతామని అన్నారని చెప్పారు.
అంతే కాకుండా ఉద్దానంలోనూ బాధితులను పట్టించుకునే వారే లేరని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజల్లో అశాంతి పెరుగుతుందని, ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే దేశ సమగ్రతకు చాలా భయంకరమైన సమస్య తలెత్తుతుందని అన్నారు. ప్రజలు రాజకీయ నాయకులని నమ్ముతున్నారని, వారు ఇచ్చే హామీలను నమ్మి అవి నెరవేర్చకపోతే ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పారు.
రిజర్వేషన్ల విషయంలో ఉత్తరాంధ్రలో రెండు వర్గాల మధ్య ప్రభుత్వమే చిచ్చుపెట్టిందని పవన్ అన్నారు. ఏ ప్రాంతాన్నయినా సుదీర్ఘకాలం వెనకబాటు తనానికి గురిచేస్తే తిరుగుబాటు వస్తుందని అన్నారు. ఎస్టీల్లో చేర్చుతామని ఓ వర్గానికి చెప్పగానే వారు నమ్మేశారని, ఇప్పుడు నెరవేర్చడం లేదని అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిందని, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.