Jayaprakash Narayan: జేఎఫ్‌సీ రెండు రాష్ట్రాల కోసం.. ఏపీ అంశంపై వాస్తవాలను వారం రోజుల్లో ప్రజల ముందు ఉంచుతాం: జేపీ
- కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగాం
- వివరాలు వచ్చాక ప్రకటిస్తాం
- అధికారిక కేటాయింపులు, హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం చెప్పాలి
- పద్మనాభయ్య, ఐవైఆర్, చంద్రశేఖర్ లతో నిజ నిర్ధారణ కమిటీ
తాము ఏర్పాటు చేస్తోన్న జేఎఫ్‌సీ.. రాష్ట్ర విభజన అంశాలపై అధ్యయనం చేసి వివరాలను ప్రజల ముందు పెడుతుందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఈ రోజు జేఎఫ్‌సీ ఏర్పాటుపై పలువురు నేతలు, రాజకీయ, ఆర్థిక వేత్తలు హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన విషయం తెలిసిందే. అనంతరం తాము తీసుకున్న పలు నిర్ణయాలపై జయప్రకాశ్ నారాయణ ప్రకటన చేశారు.
తాము కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగామని, అవి రావాల్సి ఉందని జేపీ చెప్పారు. అధికారిక కేటాయింపులు, హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులు, హామీల అమలుపై తాము నిపుణులయిన పద్మనాభయ్య, ఐవైఆర్, చంద్రశేఖర్ లతో ప్రస్తుతానికి ఓ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామని, రేపు పద్మనాభయ్య ఆధ్వర్యంలో ఓ సమావేశం ఉంటుందని తెలిపారు.
అనంతరం వారు ఏపీలో వెనకబడిన ప్రాంతాలు, పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, రాజధానిపై అధ్యయనం చేస్తారని జేపీ అన్నారు. వారం రోజుల్లో వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉందని, జేఎఫ్‌సీ భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల విషయంలోనూ పనిచేస్తుందని తెలిపారు.