Nirav Modi: నీరవ్ మోదీని రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌ను చేయండి.. దేశాన్ని నాశనం చేసేందుకు అదొక్కటే మార్గం!: శివసేన
- ఆధార్ లేకుండా అంత్యక్రియలు కూడా చేయడం లేదు
- నీరవ్ మోదీ మాత్రం అది లేకుండానే రూ.కోట్లు దోచుకెళ్లాడు
- పెద్దల ప్రమేయం లేకుండా ఇది జరిగే పనికాదు
- బీజేపీపై విరుచుకుపడిన శివసేన
భారతీయ జనతాపార్టీపై శివసేన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయలకు ముంచేసిన నీరవ్ మోదీని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నియమించాలని సూచించింది. దేశాన్ని సర్వ నాశనం చేసేందుకు ఇప్పుడు అదొక్కటే మార్గమని ఎత్తిపొడిచింది. పీఎన్బీని నిండా ముంచిన నీరవ్ కుటుంబం గత నెల మొదట్లోనే విదేశాలకు చెక్కేశారని పేర్కొంది. కోట్లాది రూపాయలను నొక్కేసిన ఈ పెద్దమనిషి (నీరవ్ మోదీ) గత నెలలో దావోస్‌లో ప్రధాని మోదీతో కలిసి ఫొటోలు దిగాడని పార్టీ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో పేర్కొంది.
నీరవ్ మోదీ బీజేపీ సానుభూతి పరుడని, ఎన్నికల కోసం బీజేపీకి నిధుల సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని శివసేన ఆరోపించింది. ఆయనొక్కడే బ్యాంకును దోచేశాడని తాము అనుకోవడం లేదని, బీజేపీ పెద్దల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందని శివసేన ఆరోపించింది. ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు నీరవ్ మోదీ చాలా సాయం చేశాడని పేర్కొంది. నీరవ్‌పై పోలీసుల కేసు ఉన్నప్పటికీ దావోస్‌లో ఆయన ప్రధాని మోదీని ఎలా కలుసుకోగలిగారో తెలియాల్సి ఉందని శివసేన పేర్కొంది.
అసలింతకీ నీరవ్ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం అయిందా? అని ప్రశ్నించింది. ఆధార్ లేకుండా సామాన్యుడికి ఆసుపత్రిలో వైద్యం అందడం లేదని, చివరికి శ్మశానంలో అంత్యక్రియలు కూడా జరగడం లేదని, అటువంటిది నీరవ్ మోదీ తన ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం చేయకుండానే అన్ని వేల కోట్లు దోచుకెళ్లాడని ఆరోపించింది.