liquor: గుజరాత్ లో మండిపోనున్న మద్యం ధరలు... భారీగా ఎక్సైజ్ డ్యూటీ పెంపు ఆలోచన
- లీటర్ మద్యంపై రూ.200వరకు పెరుగుదల
- తాగే అలవాటును నిరుత్సాహపరిచేందుకే!
- త్వరలోనే అధికారిక ప్రకటన
మద్యం తాగే అలవాటును నిరుత్సాహపరిచేందుకు గాను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు అనుమతించిన మద్యం షాపుల్లో విక్రయించే ఆల్కహాల్ పై సుంకాన్ని 50 నుంచి 100 శాతం వరకు పెంచనుంది. ప్రస్తుతం అక్కడ ఒక లీటర్ దేశీయ తయారీ విదేశీ లిక్కర్, దిగుమతి అయ్యే విదేశీ లిక్కర్, వైన్, బీరుపై రూ.25 నుంచి రూ.100 వరకు ఎక్సైజ్ డ్యూటీ ఉంది. సుంకాన్ని పెంచితే కనీసం రూ.37.50 నుంచి రూ.200 వరకు మద్యం బాటిళ్ల ధరలు పెరుగుతాయి.
‘‘రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని 50 నుంచి 100 శాతం వరకు పెంచాలనుకుంటోంది. అయితే, ఏ రకంపై ఎంత పెంచాలన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. త్వరలోనే ఇవి ఖరారవుతాయి. త్వరలో అధికారిక ప్రకటన విడుదల అవుతుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి.