Chandrababu: చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ కు చెబుతున్నా.. అవిశ్వాసానికి మేం సిద్ధం!: వైఎస్ జగన్
- ప్రజలను మోసం చేయవద్దని చంద్రబాబు, పవన్ ని కోరుతున్నా
- ప్రత్యేక హోదా ఏపీ హక్కు
- పవన్.. చంద్రబాబునాయుడుకి జ్ఞానోదయం చేయండి: జగన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ వ్యవస్థాపకుడు జగన్ ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ, ‘చంద్రబాబు పార్టనర్ పవన్ కల్యాణ్ కు చెబుతున్నా.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతారా? అని ప్రశ్నించారుగా. అయ్యా! పవన్ కల్యాణ్.. రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి.. ఎవరినైనా కలుపుకు పోయేందుకు, ఏ సలహా అయినా తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. టీడీపీ మద్దతు ఇస్తుందా? ఒకవేళ అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడితే మద్దతు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.
పవన్ కల్యాణ్ గారూ! మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం.. మీరు ఒక్కసారి చంద్రబాబు గారితో మాట్లాడండి. ఎందుకంటే, అవిశ్వాస తీర్మానం నిలబడాలంటే.. 54 మంది ఎంపీలు మద్దతు తెలపాలి. మా పార్టీకి సంబంధించి ఐదుగురు ఎంపీలు మాతో ఉన్నారు. మిగిలిన ఎంపీలను మీ చంద్రబాబునాయుడుగారు డబ్బులిచ్చి కొనుగోలు చేశారు! రాజీనామాలు చేసేందుకు మా పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారు.
అయ్యా పనవ్ కల్యాణ్ ! మీరు, చంద్రబాబునాయుడు గారు రాష్ట్ర ప్రజలను ప్యాకేజ్ ల విషయంలో మోసం చేయొద్దని కోరుతున్నా. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అని చెబుతున్నా. చంద్రబాబునాయుడు గారికి జ్ఞానోదయం చేయండి.. ప్రత్యేక ప్యాకేజ్ అనే అంశాన్ని పక్కన పెట్టండి.. ప్రత్యేక హోదా ను ముందుకు తీసుకెళ్లండి’ అని చెప్పుకొచ్చారు.