India: భువీ దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల.. తొలి టీ20 భారత్‌దే!

  • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో భారత్ ముందంజ
  • అద్భుత బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా వెన్ను విరిచిన భువనేశ్వర్
  • టీ20లలో తొలిసారి 5 వికెట్లు తీసుకున్న భువీ
  • బ్యాటింగ్‌లో ఇరగదీసిన శిఖర్ ధవన్

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన తొలి టీ20లో భారత విజయం సాధించి బోణీ కొట్టింది. వన్డే సిరీస్ విజయంతో జోరు మీదున్న భారత్ టీ20లోనూ అదే జోరును కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డుమినీ సేన 175 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. భారత బౌలర్ భువనేశ్వర్ దెబ్బకు సఫారీ బ్యాటింగ్ ఆర్డర్ కకావికలైంది. టీ20లలో తొలిసారి 5 వికెట్లు తీసుకున్న భువీ భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు.

204 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్  ప్రారంభించిన దక్షిణాఫ్రికా 29 పరుగుల వద్ద స్మట్స్ (14) రూపంలో తొలి వికెట్ కోల్పోయినా రీజా  హెన్‌డ్రిక్స్ (70) జట్టును ఆదుకున్నాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో భారత శిబిరంలో గుబులు రేపాడు. రెచ్చిపోతున్న హెన్‌డ్రిక్స్‌ను భువీ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా ఫర్హాన్ బెహర్‌డీన్ క్రీజులో నిలదొక్కుకుని మెరుపులు మెరిపించాడు. 27 బంతుల్లో మూడు 4, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేసి జట్టును విజయం వైపుగా తీసుకెళ్లాడు.

అయితే, అతడి ఆశలపై చాహల్ నీళ్లు పోశాడు. మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనక్కి వెళ్లాడు. ఇక ఆ తర్వాతి నుంచి దక్షిణాఫ్రికా కోలుకోలేదు. సాధించాల్సిన పరుగులకు-బంతులకు మధ్య తేడా పెరిగిపోతుండడంతో ఒత్తిడికి లోనైన సఫారీలు చివరికి చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పడగొట్టగా, ఉనద్కత్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ప్రారంభించింది. వచ్చీ రావడమే రోహిత్ శర్మ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21 పరుగులు చేశాడు. అయితే అదే జోరును కొనసాగించడంలో విఫలమైన రోహిత్ జూనియర్ డోలా బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 39 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక సురేశ్ రైనా 15, కెప్టెన్ కోహ్లీ 26, మనీష్ పాండే 29, ధోనీ 16, హార్దిక్ పాండ్యా 13 పరుగులు చేశారు. ఆతిథ్య  జట్టు బౌలర్లలో జూనియర్ డాలా 2 వికెట్లు తీసుకోగా, క్రిస్ మోరిస్ , తబ్రియాజ్ షంషీ, పెహ్లుక్వాయో చెరో వికెట్ తీసుకున్నారు. ఐదు వికెట్లు తీసుకుని దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన భువనేశ్వర్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టీ20 ఈనెల 21న సెంచూరియన్‌లో జరగనుంది.

  • Loading...

More Telugu News