Rotomac: బయటపడిన మరో కుంభకోణం.. రూ.800 కోట్లకు బ్యాంకులకు కుచ్చుటోపీ.. పరారీలో రోటోమాక్ పెన్నుల అధినేత విక్రమ్ కొఠారీ
- నీరవ్ మోదీ బాటలో విక్రమ్ కొఠారీ
- వారం రోజులుగా కనిపించని ఆచూకీ
- విదేశాలకు చెక్కేసి ఉంటాడని అనుమానం
- దేశాన్ని ఊపేస్తున్న వరుస కుంభకోణాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని రూ.11,300 కోట్లకు పైగా ముంచిన నీరవ్ మోదీ వ్యవహారం ఇంకా చల్లారకముందే మరో భారీ కుంభకోణం బయటపడింది. రోటోమాక్ అనే పెన్నుల తయారీ సంస్థ అధినేత విక్రమ్ కొఠారీ కాన్పూర్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచేసి పరారయ్యాడు. దాదాపు రూ.800 కోట్ల వరకు రుణాలు దండుకున్న ఆయన ఇప్పటికే దేశం విడిచి పారిపోయినట్టు సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలు నిబంధనలు తుంగలో తొక్కి మరీ కొఠారీకి రుణాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తీసుకున్న రుణాలకు వడ్డీ కూడా చెల్లించలేదని సమాచారం.
ముంబైలోని యూనియన్ బ్యాంకు నుంచి రూ.485 కోట్లు, కోల్కతాలోని అలహాబాద్ బ్యాంకు నుంచి రూ.352 కోట్లను రుణాలుగా తీసుకున్న కొఠారీ ఏడాది తర్వాత కూడా వడ్డీ కానీ, అసలు కానీ చెల్లించలేదన్న విషయం తెలిసి అధికారులే విస్తుపోతున్నారు. వడ్డీ చెల్లించని కారణంగానే బ్యాంక్ ఆఫ్ బరోడా గతేడాది రోటోమాక్ కంపెనీని ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’ జాబితాలో చేర్చింది. దీంతో తమను ఆ జాబితా నుంచి తొలగించాల్సిందిగా కొఠారీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.300 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకుకి ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’గా ప్రకటిండం తప్పు అని హైకోర్టు తీర్పు చెప్పింది.
కాగా, గత వారం రోజులుగా కొఠారీ ఆచూకీ గల్లంతైంది. కాన్పూరులోని సిటీ సెంటర్ రోడ్డులోని ఆయన కార్యాలయం వారం రోజులుగా మూతపడి ఉండడంతో విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే తాను దేశం విడిచి పారిపోయినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని స్థానిక వార్తా సంస్థలతో ఆయన పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు, కొఠారీకి ఇచ్చిన రుణాలను ఆయన ఆస్తులను జప్తు చేసైనా రాబడతామని, ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని అలహాబాద్ బ్యాంకు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.