Andhra Pradesh: చిత్తూరులో యెమన్ విద్యార్థి ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా
- ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఖాలెద్
- మరో మిత్రుడితో కలిసి స్థానికంగా అద్దెకుంటూ చదువు కొనసాగింపు
- మిత్రుడు లేకపోవడం చూసి ఆత్మహత్య
చిత్తూరులో చదువుకుంటున్న యెమన్ దేశానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 2014లో ఉపకార వేతనంపై చదువుకునేందుకు చిత్తూరు వచ్చిన ఖాలెద్ మహమూద్ ఒత్‌మాన్ నయీఫ్ నగర శివారులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సొంత దేశానికే చెందిన మరో విద్యార్థి హషీమ్ అల్ షబీతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటూ చదువుకొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని తీసుకొచ్చిన ఖాలెద్ ఆమెను కేరళకు తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అతడి రూమ్మేట్ అల్ షబీ కూడా అనారోగ్యంతో బాధపడుతూ కేరళలో చికిత్స తీసుకుంటున్నాడు. శనివారం చికిత్స కోసం అల్ షబీ మరోమారు కేరళకు వెళ్లగా తన తల్లికి కూడా అక్కడి నుంచి మందులు తీసుకురావాలని ఖాలెద్ కోరాడు.
కేరళ వెళ్లిన అల్ షబీ అక్కడి నుంచి స్నేహితుడికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మరో మిత్రుడికి ఫోన్ చేసి గదికి వెళ్లాల్సిందిగా కోరాడు. దీంతో ఖాలెద్ ఆత్మహత్య విషయం బయటపడింది. గదికి వెళ్లిన మిత్రులు హతాశులయ్యారు. అచేతనంగా పడి ఉన్న ఖాలెద్‌ను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.