GST: మీడియాలో వస్తున్న వార్తలపై తీవ్రంగా మండిపడుతున్న రాంగోపాల్ వర్మ!
- శనివారం నాడు సీసీఎస్ పోలీసుల విచారణకు వర్మ హాజరు
- ఆపై మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం
- 'జీఎస్టీ'ని తెరకెక్కించిన ఘనత తనదేనన్న వర్మ
హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణ తరువాత, మీడియాలో వస్తున్న వార్తలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. జీఎస్టీ చిత్రాన్ని తాను తీయలేదని, స్క్రిప్టును మాత్రమే ఇచ్చానని పోలీసులకు చెప్పానని పలు వార్తా చానళ్లు, పత్రికల్లో వార్తలు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాన్ని ఖండిస్తున్నట్టు చెప్పాడు. పలు మీడియా సంస్థలు అసత్యపు ప్రచారాన్ని చేశాయని మండిపడ్డాడు. సినిమా తెరకెక్కించిన ఘనత తనదేనని అన్నాడు.
తాను సినిమా నిర్మాణంలోనూ భాగస్వామినేనని చెప్పాడు. సినిమాకు తాను సాంకేతిక సహకారాన్ని మాత్రమే ఇచ్చానని ఎలా రాస్తారని ప్రశ్నించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, ఓ ఆంగ్లపత్రిక రాసిన కథనాన్ని పోస్టు చేశాడు వర్మ. కాగా, 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ) సినిమాపైన, ఆపై మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడన్న అభియోగాలపైన గత శనివారం వర్మను సీసీఎస్ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.