britain: బ్రిటన్ పోలీస్ శాఖ కీలక పదవిలో భారత సంతతి యువకుడు?
- ‘నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ ప్రస్తుత సారధి మార్క్ రౌలీ
- వచ్చేనెల బాధ్యతల నుంచి తప్పుకోనున్న రౌలీ
- రౌలీ స్ధానంలో నీల్ బసు
బ్రిటన్ కు చెందిన ‘నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ విభాగ సారధి రేసులో భారత సంతతి పోలీసు అధికారి పోటీ పడుతున్నారని 'ది సండే టైమ్స్' ప్రత్యేక కధనం ప్రచురించింది. స్కాట్ లాండ్ యార్డ్ కు చెందిన ‘నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ సారధిగా ఉన్న మార్క్ రౌలీ పదవీ బాధ్యతలు వచ్చేనెలతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన ఆ పదవిలో ఎవరిని నియమిస్తారన్న ఆసక్తి బ్రిటన్ లో నెలకొంది.
ఈ క్రమంలో ‘ది సండే టైమ్స్’ కథనంలో ప్రస్తుతం మెట్రోపాలిటన్ పోలీసు డిప్యూటీ సహాయ కమిషనర్ గా పని చేస్తున్న భారత సంతతి అధికారి నీల్ బసు ఆ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని పేర్కొంది. గత మూడేళ్లుగా ఆయన తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఈ నేపధ్యంలో ‘నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ విభాగానికి తదుపరి మార్గనిర్దేశకుడిగా ఆయనే సరైన వ్యక్తి అని ఆ కథనం పేర్కొంది.