Anisha Chowdary: వీడియోకాల్ లో ప్రియుడితో మాట్లాడుతూ అనీష ఆత్మహత్య... కారణాలివి!
- కలకలం రేపిన అనీష ఆత్మహత్య
- ప్రియుడు దీక్షిత్ కళ్లముందే ఉరేసుకున్న అనీష
- ఆత్మహత్యకు ముందు ప్రియుడితో వాగ్వాదం
- దీక్షిత్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్ లో నిన్న కలకలం రేపిన శివశివానీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ విద్యార్థిని అనీష చౌదరి ఆత్మహత్య కేసులో మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించారు. అనీషా తన ప్రియుడు దీక్షిత్ పటేల్ తో ఫోన్ లో వీడియో కాల్ లో మాట్లాడుతూ అతని కళ్లముందే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో దీక్షిత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించి, మరింత సమాచారాన్ని రాబట్టారు. పోలీసు వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు, గుజరాత్ కు చెందిన దీక్షిత్ తో అనీష చౌదరి స్నేహం, ప్రేమగా మారింది.
పెళ్లి చేసుకుందామని ఆమె కొంతకాలంగా కోరుతుండగా, దీక్షిత్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా అనీష వీడియో కాల్ చేసి మాట్లాడింది. కాసేపు బాగానే మాట్లాడుకున్న తరువాత, ఆమె పెళ్లి ప్రస్తావన తెచ్చింది. సరదాగా సాగుతున్న సంభాషణ, వాదోపవాదాలకు దారితీయగా, ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. మనస్తాపానికి గురైన అనీష, 'నేను చనిపోతున్నాను' అని చెబుతూ, ఆ వెంటనే ఉరేసుకుంది. ఆమె చేస్తున్న పనిని చూసిన దీక్షిత్ హడలిపోయి, హుటాహుటిన హాస్టల్ కు వచ్చాడు. అప్పటికే ఆమె మృతి చెందింది. దీక్షిత్ పటేల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు.
కాగా, అనీష తండ్రి అనంతపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత బుగ్గయ్య చౌదరి. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తరువాత, అనంతపురానికి తరలించగా, ఆమె స్నేహితులు, బంధువులు నివాళులు అర్పించారు. కుమార్తె మృతదేహం వద్ద బుగ్గయ్య గుండెలవిసేలా విలపించారు. అనీష మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన ఏపీ మంత్రి పరిటాల సునీత బుగ్గయ్య కుటుంబాన్ని ఓదార్చారు.