Chandrababu: రాష్ట్ర విభజన హామీలపై చర్చకు అఖిలపక్ష సమావేశం: చంద్రబాబు ప్రకటన
- అన్ని పార్టీలను సమావేశపర్చి విభజన హామీలపై చర్చ
- రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడమే మా లక్ష్యం
- అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి కావస్తోంది
- గోదావరి నీటిని విశాఖ వరకు తరలించే ప్రణాళిక
రాష్ట్ర విభజన హామీలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ రోజు ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల మనో భావాలను దెబ్బతీయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టడమే తమ లక్ష్యమని చెప్పారు. అన్ని పార్టీలను సమావేశపర్చి విభజన హామీలపై చర్చించి, తగిన విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.
కాగా, అడవిపల్లి రిజర్వాయర్ పూర్తి కావస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి నీటిని విశాఖ వరకు తరలించే ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రాష్ట్రంలో 46 వేల చెరువుల్లో పూడికతీత పనులు జరుగుతున్నాయన్నారు. జల సంరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని, రాష్ట్రంలో నీటి ఎద్దడిని నివారిస్తామని చెప్పారు.