south africa: ఇద్దరు స్పిన్నర్లతో దిగడమే టీమిండియా బలం: పాల్ ఆడమ్స్
- ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో బరిలో దిగడమే లాభిస్తోంది
- విభిన్నమైన కోణాల్లో వైవిధ్యం కలిగిన బంతులు సంధిస్తున్న కుల్దీప్, చాహల్
- ఊరించే బంతులతో ఉచ్చులోకి లాగుతున్న స్పిన్నర్లు
ఇద్దరు మణికట్టు స్పిన్నర్లతో బరిలో దిగడమే భారత్ బలమని సౌతాఫ్రికా వెటరన్ క్రికెటర్ పాల్ ఆడమ్స్ అభిప్రాయపడ్డాడు. చిత్రమైన బౌలింగ్ శైలితో ఆకట్టుకున్న పాల్ ఆడమ్స్ తొలి టీ20లో సౌతాఫ్రికా జట్టు ఓటమి నేపథ్యంలో మాట్లాడుతూ, ప్రస్తుతం క్రికెట్ అంతా బ్యాట్స్ మెన్ చుట్టూ తిరుగుతోందని అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకోవడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు.
అదే టీమిండియా బలమని, ఆ ఇద్దరూ మణికట్టు స్పిన్నర్లే కావడంతో టీమిండియాకు లాభిస్తోందని తెలిపాడు. ఇద్దరూ విభిన్నమైన కోణాల్లో వైవిధ్యమైన బంతులు సంధిస్తూ బ్యాట్స్ మన్ ను ఉచ్చులోకి లాగుతున్నారని పేర్కొన్నాడు. ఊరించే వీరి బంతులను వెంటాడుతూ బ్యాట్స్ మన్ దొరికిపోతున్నారని పాల్ ఆడమ్స్ తెలిపాడు. టీమిండియా జట్టు కూర్పు కూడా ఇద్దరు స్పిన్నర్లు ఆడేందుకు అనుమతిస్తోందని, చాలా జట్లు ఇద్దరు స్పిన్నర్లకు చోటివ్వవని అన్నాడు. ఇతర జట్లకు, భారత జట్టుకు తేడా ఇదేనని పాల్ ఆడమ్స్ తెలిపాడు.