PNB: బ్యాంకు కుంభకోణంలో తప్పంతా ఆర్బీఐపై నెట్టేసిన కేంద్రం!
- రిజర్వ్ బ్యాంకు నిఘా వైఫల్యమే
- వెంటనే నివేదిక కోరిన కేంద్రం
- ఆర్బీఐ అధికారుల ప్రమేయంపై అనుమానాలు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, ఈ మొత్తం తప్పంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైఫల్యంతోనే జరిగిందని కేంద్రం వ్యాఖ్యానించింది. బ్యాంకులో జరుగుతున్న మోసాన్ని ముందే కనిపెట్టడంలో ఆర్బీఐ విఫలమైందని, అసలేం జరిగిందో వెల్లడించాలని ప్రధాని కార్యాలయం ఇప్పటికే ఆర్బీఐని కోరింది. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఏడు సంవత్సరాల పాటు బ్యాంకుల నుంచి గ్యారెంటీ లెటర్లు తీసుకుని ఎడాపెడా రుణాలను పొందుతుంటే, ఏ దశలోనూ పట్టుబడక పోవడం వెనుక బ్యాంకింగ్ వ్యవస్థపై ఉండాల్సిన నిఘా విఫలమైనట్టేనని భావిస్తున్న కేంద్రం ఈ మేరకు నివేదిక ఇవ్వాలని ఆర్బీఐని ఆదేశించింది. ఇదే సమయంలో ఆర్బీఐ నిఘా విభాగంలో పని చేస్తున్న ముగ్గురు అధికారుల ప్రమేయం కుంభకోణం వెనుక ఉండవచ్చన్న అనుమానాలు తలెత్తుతుండటంతో కేసును విచారిస్తున్న అధికారులు వారిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.