Heng Swee Keat: సింగపూర్ పౌరులకు సర్కార్ వరం...అందరికీ బోనస్

  • 21 ఏళ్లు ఆ పై వయసున్న వారు అర్హులు
  • 'హోంగ్‌బావో' బోనస్‌గా ప్రజలకు అందజేత
  • బోనస్‌ కోసం సర్కార్ ఖజానా నుండి 700 మిలియన్ డాలర్లు మైనస్

సింగపూర్ సర్కార్ తమ ప్రజలందరికీ బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ పొందడానికి 21 ఏళ్లు పైబడిన వయసువారు అర్హులు. ఒక్కొక్కరికి సుమారు 300 (సింగపూర్) డాలర్లు బోనస్‌గా అందనుంది. 2017 బడ్జెట్‌లో మిగిలిన దాదాపు 10 బిలియన్ల సింగపూర్ డాలర్లను ప్రభుత్వం బోనస్‌ కింద ప్రకటించడంతో ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికమంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ప్రత్యేక సందర్భాల్లో ద్రవ్య బహుమతిగా దీనిని ప్రకటిస్తుంటారు. దీనిని 'హోంగ్‌బావో' బోనస్‌గా పేర్కొంటారు.

సింగపూర్ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని సుదీర్ఘకాలంగా తమకున్న నిబద్ధతకు తాజా బోనస్ నిర్ణయం ఓ నిదర్శనమని ఆయన చెప్పినట్లు చానల్ న్యూస్ ఆసియా ఉటంకించింది. ఈ బోనస్ ప్రకటనకు గాను ప్రభుత్వం 700 మిలియన్ల సింగపూర్ డాలర్లు అందిస్తుంది. ప్రజల ఆదాయాన్ని మదింపు వేసిన తర్వాతే ఈ బోనస్‌ను అందిస్తామని హెంగ్ చెప్పారు. ఈ ఏడాది ఆఖరు కల్లా మొత్తం దాదాపు 2.7 మిలియన్ల మంది ఈ బోనస్‌ అందుకోనున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం, వార్షికాదాయం 28 వేల (సింగపూర్) డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న వారు 300 డాలర్ల బోనస్‌ను అందుకునేందుకు అర్హులు. అదే విధంగా 28,001-1,00,000 డాలర్ల మధ్య ఉన్న వారు 200 డాలర్లు, 1,00,000 డాలర్ల పైన ఆదాయమున్న వారు 100 డాలర్లు బోనస్‌గా అందుకుంటారు.

  • Loading...

More Telugu News