smartphones: 2017లో 29 కోట్ల స్మార్ట్ ఫోన్ల దిగుమతి: సీఎల్ఎస్ఏ
- 2020లో భారత్ లో 1.4 కోట్ల మేర వృద్ధి
- అదే ఏడాది చైనా స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 69 కోట్లు
- ప్రపంచంలోని టాప్ -30లో మైక్రోమ్యాక్స్
2020లో భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం 1.4 కోట్ల యూనిట్ల మేర వృద్ధిని నమోదు చేస్తుందని సీఎల్ఎస్ఏ అనే సంస్థ అంచనా వేసింది. ఈ సంస్థ 2017 సంవత్సరానికి సంబంధించి కీలక గణాంకాలను సైతం విడుదల చేసింది. 2017లో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి ఒక శాతం తగ్గి 43 శాతానికి పరిమితం కాగా, అధిక సంఖ్యలో ఫోన్లు దిగుమతి అయ్యాయి. 28.8 కోట్ల మొబైల్, స్మార్ట్ ఫోన్లు భారత్ కు దిగుమతి అయ్యాయి. కేవలం స్మార్ట్ ఫోన్లనే చూసుకుంటే 12.4 కోట్లుగా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో కొరియా కంపెనీ శామ్ సంగ్ అగ్ర స్థానంలో ఉంది. 2017లో 31.77 కోట్ల స్మార్ట్ ఫోన్లను ఈ సంస్థ ఎగుమతి చేసింది. తర్వాత 21.5 కోట్ల ఫోన్లతో యాపిల్, 15.4 కోట్ల యూనిట్లతో హువావే ఉన్నాయి. వీటి మార్కెట్ వాటా వరుసగా 22 శాతం, 15 శాతం, 11 శాతంగా ఉంది. భారత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ ప్రపంచంలోని 30 స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లలో ఒకటిగా ఉంది. 2017లో 66 లక్షల ఫోన్లను ఎగుమతి చేసింది. 2020 నాటికి చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు 69 కోట్ల మేర ఫోన్లను ఎగుమతి చేస్తాయని సీఎల్ఎస్ఏ అంచనా.