Pawan Kalyan: జగన్ ఎలాంటి సవాలూ విసరలేదు.. పవన్ కల్యాణ్ గుర్తించాలి: అంబటి రాంబాబు
- పవన్ సలహాను స్వీకరిస్తామని జగన్ చెప్పారు
- మార్చి 21న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతాం
- జగన్ ను ప్రశ్నిస్తున్న పవన్.. చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడం లేదు?
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని... అయినా ఆయనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట కూడా అనలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై ఎలాంటి అవగాహన లేదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించి చేసినవి కావని... పవన్ ను ఉద్దేశించి చేసినవని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతున్న పవన్... జగన్ ను ప్రశ్నిస్తున్నారే కాని, చంద్రబాబును మాత్రం ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
పవన్ కు జగన్ ఎలాంటి సవాలు విసరలేదని... పవన్ సలహాను స్వీకరిస్తున్నామని మాత్రమే చెప్పారని అంబటి అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానికి వైసీపీ ఎల్లప్పుడూ సిద్ధమేనని, పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పారు. సెక్షన్ 184 కింద తమ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన నోటీసు నేపథ్యంలో పార్లమెంటులో కచ్చితంగా చర్చ, ఓటింగ్ జరుగుతాయని... అప్పుడైనా ఓటింగ్ లో పాల్గొనాలని మీ పార్ట్ నర్ చంద్రబాబుకు చెప్పాలని ఎద్దేవా చేశారు.
మా పార్టీ ఎంపీలను చంద్రబాబు కొంటుంటే... పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని అంబటి అన్నారు. పవన్ తప్పుడు దారిలో వెళుతున్నారని, ఎవరికో మేలు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని, ఆయన నిష్పక్షపాతంపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పాచిపోయిన లడ్డూలు అంటూ తమరు బీజేపీని తప్పుబట్టారే కానీ, లడ్డూలు చాలా బాగున్నాయన్న చంద్రబాబును మాత్రం ప్రశ్నించలేదని చెప్పారు.