Virat Kohli: కోహ్లీని ఊరిస్తున్న వివ్ రిచర్డ్స్ అరుదైన రికార్డు!
- ఒకే టూర్ లో 1045 పరుగులు చేసిన వివ్ రిచర్డ్స్
- ఒకే టూర్ లో 974 పరుగులు చేసిన డాన్ బ్రాడ్ మన్
- సఫారీ టూర్ లో ఇప్పటికి 870 పరుగులు చేసిన కోహ్లీ
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డు ఉరిస్తోంది. సఫారీ టూర్ లో ఇప్పటి వరకు 87 సగటుతో 870 పరుగులు చేసిన కోహ్లీ ముందు ఒకే సిరీస్ లో వెయ్యి పరుగులు పైన సాధించిన వివ్ రిచర్డ్స్ రికార్డు ఊరిస్తోంది. క్రికెట్ చరిత్రలో ఒకే టూర్ లో వెయ్యి పరుగులు సాధించిన ఘనత విండీస్ విధ్వంసకర దిగ్గజం వివ్ రిచర్డ్స్ పేరుమీద మాత్రమే ఉంది. 1976లో ఇంగ్లండ్ టూర్ లో వివ్ రిచర్డ్స్ నాలుగు టెస్టుల్లో 829 పరుగులు, వన్డేల్లో 216 పరుగులు చేసి, ఈ రికార్డు సృష్టించాడు. ఆ టూర్ లో రిచర్డ్స్ మొత్తం 1045 పరుగులు సాధించాడు. ఆ తరువాత ఈ ఫీట్ ను ఎవరూ చేయలేదు.
దిగ్గజాలైన గవాస్కర్, శ్రీకాంత్, లారా, పాంటింగ్, గంగూలీ, ద్రవిడ్, సచిన్ తదితరులతో పాటు విధ్వంసకర ఆటగాళ్లుగా పేరుతెచ్చుకున్న సెహ్వాగ్, గేల్ కు కూడా ఈ ఫీట్ సాధ్యం కాలేదు. ఇన్నేళ్ల తరువాత కోహ్లీ ముందు అద్భుత అవకాశం వేచి చూస్తోంది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు కోహ్లీ నాలుగు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 870 పరుగులు సాధించాడు. ఇంకా రెండు టీ20లు మిగిలి ఉన్న నేపథ్యంలో కోహ్లీ ఈ ఫీట్ సాధించాలని సగటు టీమిండియా అభిమాని కోరుకుంటున్నాడు. కాగా, ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్ ఇంగ్లండ్ టూర్ లోనే ఐదు టెస్ట్ ల సిరీస్ లో 974 పరుగులు సాధించి ద్వితీయ స్థానంలో ఉన్నాడు.