gandhi: జాతిపిత మహాత్మా గాంధీ హత్య కేసులో కీలక ఆధారాలు.. ఆసక్తి చూపిన సుప్రీం!
- సుప్రీంకోర్టుకు తీసుకొచ్చిన ‘అభినవ్ భారత్’ సంస్థ ధర్మకర్తృత్వ మండలి సభ్యుడు డా.పంకజ్ ఫడ్నీస్
- గాంధీజీ హత్య వెనుక భారీ కుట్ర
- ఈ కీలకమైన పత్రాలను భారత సర్కారు గతంలో నిషేధించింది
- సీల్డ్ కవర్లో ఉన్నాయి.. నేను కూడా తెరవలేదు
జాతిపిత మహాత్మా గాంధీ హత్య వెనుక ఉన్న కారణాలపై అమెరికా నుంచి తిరిగివస్తూ అక్కడి లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నుంచి కొన్ని పత్రాలను తీసుకొచ్చానని ముంబయికి చెందిన ‘అభినవ్ భారత్’ సంస్థ ధర్మకర్తృత్వ మండలి సభ్యుడు డా.పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. గాంధీజీ హత్యపై పునర్విచారణ కోరుతూ వేసిన పిటిషన్ లో భాగంగా ఆయన వీటిని దాఖలు చేశారు. దీనిపై నిన్న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఫడ్నీస్ మాట్లాడుతూ... గాంధీజీ హత్య వెనుక భారీ కుట్ర జరిగినట్లు తెలిపారు.
ఈ కీలకమైన పత్రాలను భారత సర్కారు గతంలో నిషేధించిందని అన్నారు. ఈ కేసులో న్యాయవైజ్ఞానిక ఆధారాలను పొందవచ్చని అమెరికాకు చెందిన అటార్నీ ఒకరు సూచిస్తూ రాసిన లేఖను కూడా ఆయన పొందుపరిచారు. ఆ లేఖను పరిశీలించిన ధర్మాసనం... ఆయన అందించిన ఆధారాలు ఆసక్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. కేసును పునర్విచారించే విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది.
పిటిషనర్ సీల్డు కవరులో ఉన్న ఆ ఆధారాలను సమర్పించారు. సీల్డు కవరులో ఉన్న అంశాలను తెరవకూడదని నిబంధన ఉండడంతో తాను ఈ దస్త్రాల సీలును కూడా తెరవలేదని తెలిపారు. సీల్డ్ పత్రాలను తెరవకూడదనే నిబంధనను కూడా ఎత్తి వేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ కేసులో విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.