Pilot Amol Yadav: విమానాల పైలట్‌తో మహారాష్ట్ర సర్కార్ రూ.35 వేల కోట్ల భారీ డీల్!
- మేగ్నటిక్ మహారాష్ట్ర ఇన్వెస్టర్ల సదస్సు వేదికగా ఒప్పందం
- మొత్తం 157 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
- 6 సీట్లు, 19 సీట్ల సామర్థ్యమున్న విమానాల తయారీ
ఎప్పటికైనా ఓ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కంపెనీని నెలకొల్పాలన్న ఓ కమర్షియల్ పైలట్ కల ఎట్టకేలకు నెరవేరింది. విమానాల తయారీ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం పైలట్ అమోల్ యాదవ్‌తో మంగళవారం రూ.35వేల కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ముంబై శివారులోని బంద్రాలో జరిగిన మేగ్నటిక్ మహారాష్ట్ర అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు వేదికగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పైలట్ అమోల్, ఎంఐడీసీ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. పల్గఢ్ జిల్లాలోని సుమారు 157 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ ద్వారా పదివేల మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు కింద 6 సీట్లు, 19 సీట్ల సామర్థ్యంతో దేశవాళీ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా అమోల్ మాట్లాడుతూ... "విమానాలు తయారు చేసే కర్మాగారం నెలకొల్పాలన్నది నా చిరకాల కోరిక. నా శక్తిసామర్థ్యాలను సదస్సులో ఈ ప్రదర్శించాను. దేశంలోనే మొట్టమొదటి విమానాల తయారీ కర్మాగారాన్ని మహారాష్ట్రలోనే నెలకొల్పాలని ఫడ్నవీస్ ఆకాంక్షించారు. ఎంఐడీసీ మాకు భూమిని, రహదారులు లాంటి సదుపాయాలను కల్పిస్తుంది" అని ఆయన చెప్పారు.
రానున్న రెండుమూడేళ్లలో 19 సీటర్ల విమానాలను 600 తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఇంజిన్లను ప్రాట్ అండ్ వైట్నీ సంస్థ సరఫరా చేస్తోందని ఆయన తెలిపారు. 2016లో ముంబైలో నిర్వహించిన మేకిన్ ఇండియా ప్రదర్శనలో ఆయన ప్రదర్శించిన ఆరు సీట్ల విమానం అందర్నీ ఆకర్షించింది.