Priya Prakash: కనుసైగలతో సెన్సేషన్ రేపిన కేరళ కుట్టికి సుప్రీంకోర్టులో ఊరట!
- 'ఒరు అదార్ లవ్' చిత్రంలో వివాదాస్పద పాట
- ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కేసులు
- స్టే విధించిన సుప్రీంకోర్టు
ఒక పాటలోని చరణంలో కన్నుకొట్టి కోట్లాది మంది యువకుల గుండెల్లో గుబులు పుట్టించిన కేరళ నయా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ కు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఆమె ముస్లింల మనోభావాలను కించపరిచే పాటలో నటించిందని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన వేళ, వాటిపై స్టే విధించాలని ప్రియ, సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ కేసును నేడు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, తెలంగాణ, మహారాష్ట్ర సహా అన్ని పోలీసు స్టేషన్లలో ప్రియా ప్రకాశ్ పై నమోదైన కేసులపై స్టే విధిస్తున్నట్టు ప్రకటించింది. ఆమెపైనా, 'ఒరు అదార్ లవ్' నిర్మాతలు, దర్శకుడిపై సినిమాకు సంబంధించి ఎటువంటి కేసులనూ నమోదు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎక్కడా వారిపై కేసులు నమోదు చేయరాదని చెబుతూ, ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఆర్ ల పూర్వాపరాలను, అందుకు సంబంధించిన సాక్ష్యాలను తమ ముందు ఉంచాలని సూచించింది.