Kamal Haasan: చంద్రబాబు నాయుడే నా హీరో!: రాజకీయ నేతగా కమల్ తొలి వ్యాఖ్య
- నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు
- ప్రజా సేవపై సలహాలు ఇచ్చారు
- మీడియాతో కమల్ హాసన్
ఈ ఉదయం రామేశ్వరం నుంచి యాత్రను ప్రారంభించి తమిళనాట పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చేసిన విలక్షణ నటుడు కమలహాసన్ అక్కడి హయత్ ప్యాలస్ లో మీడియాతో మాట్లాడారు. తాను గాంధీ మహాత్ముడికి వీరాభిమానినని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హీరో అని వ్యాఖ్యానించారు.
"నిన్న రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు సేవ చేసే విధానంపై సలహాలు, సూచనలు ఇచ్చారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యాత్రలో భాగంగా అభిమానులు తనకు శాలువాలు కప్పుతున్నారని, ఇకపై తనకు ఎటువంటి శాలువాలూ కప్పవద్దని, తానే ప్రజలకు శాలువానౌతానని వ్యాఖ్యానించారు.
సినిమాలకు, రాజకీయాలకూ తేడా ఉందని తాను భావించడం లేదని, రెండు రంగాలూ ప్రజల కోసమేనని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయాల్లో బాధ్యత కాస్తంత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తాను అంత్యక్రియలకు హాజరుకాను కాబట్టే కలామ్ అంత్యక్రియలకు రాలేదని చెప్పారు. ఆయన చదివిన పాఠశాలకు వెళ్లాలని భావించానని, కానీ స్కూల్ యాజమాన్యం అందుకు అనుమతించలేదని చెప్పిన కమల్, తనను అడ్డుకున్నారే తప్ప, ఆయన్నుంచి తాను నేర్చుకోవాలనుకున్న విషయాలను అడ్డుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రజలు తమ గుండెల్లో తనను పెట్టుకున్నారని, ఇకపై వారింటి సభ్యుడిగా తాను మెలగుతానని అన్నారు.