United States: భారత పేదలపై జూనియర్ ట్రంప్ ప్రశంసలు!
- కష్టాలొచ్చినా పేదల ముఖంపై చిరునవ్వు బాగుంది
- భారతదేశంలోని స్ఫూర్తి చాలా భిన్నమైనది
- దు:ఖజనులుగా కొందరు వ్యాపార దిగ్గజాలు
భారత్‌లో వారం రోజుల వ్యాపార పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ దేశంలోని పేదలపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి కష్టనష్టాలొచ్చినా సరే ఇక్కడి పేదల ముఖంపై చిరునవ్వు ఉండటం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ దేశంలో ఉన్న 'స్ఫూర్తి' ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే చాలా భిన్నంగా ఉందని ఆయన చెప్పారు. అందువల్లే భారత్ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందని ఆయన అన్నారు.
ప్రపంచంలోని కొంతమంది విజయపథాన దూసుకుపోతోన్న వ్యాపార దిగ్గజాలు తనకు తెలుసునని, కానీ వారిలో కొందరు ప్రపంచంలోనే అత్యంత విచారకరమైన వ్యక్తులుగా ఉన్నారని జూనియర్ ట్రంప్ మంగళవారం దేశంలోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. భారత్‌లోని మొత్తం నాలుగు నగరాల్లో నిర్మించిన 'ట్రంప్ టవర్స్' ప్రాజెక్టులకు ప్రచారం కల్పించడం కోసం ట్రంప్ జూనియర్ ఇక్కడికి వచ్చారు. అంతకుముందు ఆయన న్యూఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో రియల్ ఎస్టేట్ డెవలపర్లతో భేటీ అయ్యారు.