Bangladesh: మాకు పెట్టుబడులు కావాలి... ఏ దేశంతోనయినా చేతులు కలుపుతాం: షేక్ హసీనా
- చైనాతో సంబంధాలు మా దేశాభివృద్ధి కోసమే
- దీనిపై భారత్ ఆందోళన చెందక్కర్లేదు
- బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా స్పష్టీకరణ
చైనాతో తమ సంబంధాలు బలోపేతం అవుతుండడంపై భారత్ కు ఆందోళన అక్కర్లేదని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. చైనాతో సహకారం కేవలం తమదేశ అభివృద్ధి కోసమేనని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం అభివృద్ధి గురించే ఆలోచిస్తోంది. అందుకే బంగ్లాదేశ్ అభివృద్ధికి సహకారం అందించే ఏ దేశంతో అయినా కలసి పనిచేసేందుకు సిద్ధం. మాకు పెట్టుబడులు, సహకారం అవసరం. అది ఎవరు అందించినా సరే. మా దేశాభివృద్ధిని కోరుకుంటున్నాం. మా ప్రజల గురించే మేం ఆలోచించాల్సి ఉంటుంది’’ అని షేక్ హసీనా నిన్న తనను కలసిన భారత జర్నలిస్టుల బృందంతో అన్నారు.
భారత్, చైనా, జపాన్, మధ్య ప్రాచ్య దేశాలు కూడా సహకారం అందించేందుకు వస్తున్నట్టు ఆమె చెప్పారు. ‘‘దీనిపై భారత్ ఆందోళన చెందక్కర్లేదు. బంగ్లాదేశ్ సహా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పుకోవాలని నేను భారత్ కు సూచిస్తున్నా. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. మేమంతా కలసి పనిచేస్తున్నామని ప్రపంచానికి చాటి చెప్పొచ్చు’’ అని హసీనా సూచించారు.