Police: నకిలీ 'పోలీస్', 'ప్రెస్' స్టిక్కర్లతో తిరుగుతున్న వారి బెండుతీస్తున్న హైదరాబాద్ పోలీసులు!
- నకిలీ స్టిక్కర్లపై చర్యలు
- హైదరాబాద్ లో విస్తృత తనిఖీలు
- పట్టుబడిన 50 మంది
- తొలితప్పుగా జరిమానాతో సరిపెట్టిన పోలీసులు
ఇటీవలి కాలంలో 'పోలీస్', 'ప్రెస్' అని నకిలీ స్టిక్కర్లు తగిలించుకుని కార్లు, ద్విచక్ర వాహనాల్లో తిరుగుతున్న వారి సంఖ్య పెరిగిపోవడంతో హైదరాబాద్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. గతవారం ఓ యువకుడు 'పోలీస్' అని స్టిక్కర్ వేసున్న కారులో లాఠీతో సహా ప్రయాణిస్తూ డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో గోషామహల్, కంచన్ బాగ్ తదితర ప్రాంతాల్లో తాము విలేకరులమని చెప్పి కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులూ అందాయి.
దీంతో ట్రాఫిక్ పోలీసులు నిన్న వివిధ కూడళ్లలో మకాంవేసి, కేవలం పోలీస్, ప్రెస్ అని స్టిక్కర్లున్న వాహనాలనే ఆపి తనిఖీలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా, మొత్తం 50 మంది నకిలీలు దొరికిపోయారు. తొలి తప్పుగా భావించి, వారి వాహనాలకు స్టిక్కర్లను తొలగించి, జరిమానా విధించినట్టు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ రవీందర్ వెల్లడించారు. నకిలీలను ఏరివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇకపై సడన్ గా చెకింగ్ లు నిర్వహించి, నకిలీలకు చెక్ పెడతామని తెలిపారు.