Facebook: ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌పై కేసు వేసిన పారిస్ ఉగ్రదాడి బాధితురాలు!
- ఈ మూడు ఉగ్రవాదానికి ఊతమిస్తున్నాయని ఆరోపణ
- 2015లో పారిస్ ఉగ్రదాడి..130 మంది దుర్మరణం
- తమ సైట్‌లో ఉగ్రవాదానికి చోటు లేదన్న ఫేస్‌బుక్
- స్పందించని ట్విట్టర్, గూగుల్
పారిస్ ఉగ్రదాడి బాధితురాలు ఒకరు ట్విట్టర్, ఫేస్‌బుక్, గూగుల్‌పై కేసు వేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు విచ్చలవిడిగా పెరిగిపోవడానికి ఈ మూడే కారణమని పేర్కొంటూ కోర్టుకెక్కారు. 2015లో జరిగిన పారిస్ ఉగ్రదాడిలో మొత్తం 130 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఓ కేఫ్‌లో ఉన్న షికాగోకు చెందిన మండీ పాల్‌ముక్కి బాధితురాలిగా మిగిలారు.
తాజగా గతవారం ఆమె షికాగో కోర్టులో ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్‌పై దావా వేస్తూ ఇస్లామిక్ ఉగ్రవాదం పెరగడానికి ఈ మూడు పరోక్షంగా దోహదం చేస్తున్నాయని ఆరోపించారు. ఉగ్రదాడి జరిగినప్పుడు తానున్న కేఫ్‌లో 12 మందికిపైగా చనిపోవడంతో ఆమె మానసికంగా తీవ్రంగా గాయపడినట్టు లాసూట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ ఉగ్రదాడి తమపనేనని అప్పట్లో ఐసిస్ ప్రకటించింది.
విషయం తెలిసిన ఫేస్‌బుక్ స్పందిస్తూ తమ సైట్‌లో ఉగ్రవాదానికి కానీ, అటువంటి అంశాలకు కానీ చోటు లేదని తేల్చి చెప్పింది. అటువంటి పనులకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. తమపై కేసు దాఖలైన విషయంపై ట్విట్టర్, గూగుల్‌లు ఇప్పటి వరకు స్పందించలేదు.