Bihar: దెయ్యాల వల్ల ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది: లాలూ చిన్న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యంగ్యం
- బీహార్ లో ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసిన తేజ్
- నితీశ్, సుశీల్ అనే పేర్లున్న దెయ్యాలున్నాయి
- వాస్తులోపం కూడా ఉందన్న తేజ్
- ఆయన ఆరోపణలను ఖండించిన జేడీ (యూ)
బీహార్ రాజధాని పాట్నాలో తనకు కేటాయించిన బంగ్లాను కొన్ని దెయ్యాలు, భూతాలు పట్టుకుని ఉన్నాయని లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు, ఆరోగ్య శాఖ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలు అనడానికి వెనుక ఓ పెద్ద కథే ఉంది. బీహార్ లో నితీశ్, లాలూ నేతృత్వంలోని మహాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దేశ్ రత్న మార్గంలోని మూడో రహదారిలో ఉన్న బంగ్లాను ఆయనకు కేటాయించారు.
ఆపై గత సంవత్సరం నితీశ్, లాలూల మధ్య బంధం తెగిపోగా, బీజేపీ సహకారంతో నితీశ్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆపై అందరికీ పంపినట్టుగానే తేజ్ కు సైతం భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులు పంపగా, ఆయన హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆపై మార్కెట్ రేటు ప్రకారం భవనానికి అద్దె చెల్లించాలని ప్రభుత్వం నోటీసులు పంపగా, హైకోర్టు ఆ నిర్ణయాన్ని మాత్రం సమర్థించింది.
దీంతో భవనాన్ని ఖాళీ చేసిన తేజ్ ప్రతాప్, వెళుతూ వెళుతూ నితీశ్ కుమార్, సుశీల్ మోడీ అనే పేర్లున్న దెయ్యాలు భవనాన్ని పట్టుకున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ భవనంలో వాస్తు సరిగ్గా లేదని, తాను ముందు గేటు నుంచి కాకుండా వెనుకవైపు నుంచి తిరిగే వాడినని కూడా ఆయన అన్నారు. ఇక్కడ తేజ్ ప్రతాప్ కేవలం కార్యకర్తలతో సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. మిగతా సమయమంతా పక్కనే మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న తన తల్లి రబ్రీ దేవికి ఇచ్చిన బంగ్లాలో ఉండేవారు. కాగా, యాదవ్ చేసిన ఆరోపణలను నితీశ్ వర్గం కొట్టిపారేసింది. ఆయన గిమ్మిక్కులు చేస్తున్నారని, ప్రచారం కోసమే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది.