Twitter: రాహుల్‌ని 'ఫాలో' అయిన బిగ్ బి..!
- ఇతర కాంగ్రెస్ నేతలనూ ఫాలో అయిన బిగ్ బి
- బీజేపీ, ఆర్జేడీ, ఆప్, సీపీఎం నేతలను కూడా
- బిగ్ బి ఫాలోయర్లు 33.1 మిలియన్ల మందికి పైగా
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నట్లుండి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అదే పార్టీకి చెందిన పలువురు నాయకులను ఫాలో అయ్యారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఆర్జేడీ, ఆప్ నేతలను కూడా ఆయన ఫాలో కావడం ఇటు రాజకీయ వర్గాల్లోనే కాక అటు సామాజిక మాధ్యమాలలోను ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బిగ్ బికి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలుండేవి. అంతేకాక ఆయన నెహ్రూ-గాంధీ కుటుంబంతో కూడా సన్నిహితంగా మెలిగారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి మంచి మిత్రుడు కూడా. ఆ స్నేహంతోనే అప్పట్లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి బిగ్ బి చాలాకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఇలా కాంగ్రెస్ నేతలను ఆయన ఫాలో అవుతుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నేతలు పి.చిదంబరం, కపిల్ సిబాల్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అజయ్ మాకెన్, జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైటల్, సీపీ జోషిలను అమితాబ్ ఈ నెల నుండి ట్విట్టర్లో ఫాలో అవడం మొదలుపెట్టారు. వారితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలైన మనీశ్ తివారీ, షకీల్ అహ్మద్, సంజయ్ నిరుపమ్, రణ్‌దీప్ సుర్జీవాలా, ప్రియాంకా చతుర్వేది, సంజయ్ ఝాలను కూడా బిగ్ బి ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం బిగ్ బి గుజరాత్ రాష్ట్రానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ నేతలు నితిన్ గడ్కరీ, సురేష్ ప్రభులతో పాటు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మీసా భారతి, జేడీ (యూ) చీఫ్ నితీశ్ కుమార్, సీపీఐ-ఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్, ఆశిష్ ఖేతన్లను కూడా అమితాబ్ ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో అమితాబ్‌కు ప్రస్తుతం 33.1 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆయన 1689 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.