Rahul Gandhi: మోదీ ఒక గొప్ప ఇంద్రజాలికుడు.. త్వరలోనే ప్రజాస్వామ్యాన్ని కూడా మాయం చేసేస్తారు: రాహుల్ గాంధీ ఎద్దేవా
- కుంభకోణాలకు పాల్పడ్డవారిని దేశం నుంచి మాయం చేశారు
- త్వరలోనే ప్రజాస్వామ్యాన్ని కూడా మాయం చేస్తారు
- ప్రజలకు జీవితంపై భరోసా కల్పించడంలో మోదీ విఫలమయ్యారు
ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. మోదీ గొప్ప ఇంద్రజాలికుడని, త్వరలోనే దేశం నుంచి ప్రజాస్వామ్యాన్ని కూడా ఆయన మాయం చేస్తారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిని అంతం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన మోదీ... ఆ పని చేయకపోగా, కుంభకోణాలకు పాల్పడిన వారిని మాత్రం దేశం నుంచి మాయం చేస్తున్నారని, భారత చట్టాలు చేరుకోలేని దేశాలకు వారిని తరలిస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రజలకు జీవితంపై భరోసా కల్పించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. మేఘాలయలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. రాఫెల్ ఒప్పందాలపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తెలపాలని రాహుల్ డిమాండ్ చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో నీరవ్ మోదీ కుంభకోణం, రాఫెల్ ఒప్పందాలపై ప్రధాని మాట్లాడాలని అన్నారు. ప్రజలు, మేధావులు ఇస్తున్న సూచనలను స్వీకరించలేనప్పుడు... వారి నుంచి సూచనలు కోరడం ఎందుకని ప్రశ్నించారు.