Donald Trump: కాల్పుల ఘటనలకు చెక్ పెట్టేందుకు ట్రంప్ ఇచ్చిన సలహాలివి...!

  • కొన్ని తుపాకుల కొనుగోలుకు వయో పెంపు యోచన
  • కొనుగోలుదారుల నేపథ్య తనిఖీలు మరింత కట్టుదిట్టం
  • చిన్నారుల నుంచీ సలహాలు తీసుకున్న అధ్యక్షుడు
  • మానసిక ఆరోగ్యశాలల మూసివేతపై ధ్వజం

అమెరికాలో పెరిగిపోతోన్న తుపాకీ సంస్కృతిపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు స్పందించారు. ఇటీవల ఫ్లోరిడాలోని ఓ హైస్కూల్‌లో 17 ఏళ్ల నికోలస్ క్రూజ్ అనే మైనర్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్, చికాగో, పిట్స్‌బర్గ్ నగరాల్లో బుధవారం వందలాది మంది భారీ స్థాయిలో నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో ట్రంప్ శ్వేతసౌథంలో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఆయన సుమారు గంట పాటు ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఇలాంటి కాల్పుల ఘటనకు చెక్ పెట్టేందుకు ఆయనో సలహా ఇచ్చారు. స్కూల్ టీచర్ల వద్ద తుపాకులుంటే ఇలాంటి కాల్పుల ఘటనలను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) సూచించిన ఈ ఐడియాకు ట్రంప్ జిందాబాద్ కొట్టారు. ఇకపై తుపాకుల కొనుగోలుదారుల నేపథ్య తనిఖీలను మరింత కట్టుదిట్టం చేస్తామని, కొన్ని రకాల తుపాకుల కొనుగోలుకు వయసు పెంపును కూడా పరిశీలిస్తామని ట్రంప్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సాయుధ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు కలిసి కాల్పులకు పాల్పడాలని భావించే స్కూల్ షూటర్లను భయపెట్టి, విద్యార్థుల మరణాలను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

"తుపాకులను వాడటంలో అనుభవమున్న టీచర్ ఉంటే కాల్పులకు పాల్పడే వారిని అడ్డుకోవచ్చు" అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ ఐడియాకు కొందరు మద్దతు తెలపగా మరికొంత మంది దీనిని వ్యతిరేకించారు. ఆరో తరగతి విద్యార్థులు సహా దాదాపు 40 మంది ఇచ్చిన సలహాలను ట్రంప్ సావధానంగా ఆలకించారు. మరోవైపు హింసాత్మక ప్రవృత్తి కలిగిన వారిని అంచనా వేయడానికి సాయం చేసే పలు మానసిక చికిత్స ఆలయాలను మూసివేస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. పార్క్‌ల్యాండ్‌లోని మార్జోరీ స్టోన్‌మ్యాన్ డౌగ్లాస్ హైస్కూల్‌పై క్రూజ్ జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News