Madhya Pradesh: 'మిగ్-21' నడిపిన తొలి భారత మహిళ అవానీ!
- యుద్ధవిమాన పైలట్‌గా మధ్యప్రదేశ్ మహిళ ఘనత
- జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో అరగంట సేపు విహారం
- దేశం గుర్తించుకోదగ్గ రోజని ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రశంస
'మిగ్-21' యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి భారత మహిళగా మధ్యప్రదేశ్‌కి చెందిన అవానీ చతుర్వేది రికార్డు నెలకొల్పారు. సోమవారం మధ్యాహ్నం జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ఆమె సుమారు అరగంట సేపు ఈ సాహసం చేశారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శిక్షణ పొందుతున్న మొట్టమొదటి ముగ్గురు యుద్ధ విమానాల పైలట్లలో ఆమె కూడా ఒకరు కావడం గమనార్హం.
"మిగ్-21 బైసన్ యుద్ధ విమానంలో ఒంటరిగా తొలి సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఫ్లయింగ్ ఆఫీసర్ అవానీకి నా హృదయపూర్వక అభినందనలు. ఐఏఎఫ్ ఎల్లప్పుడూ మహిళా అధికారులకు కూడా సమ ప్రాధాన్యతను ఇవ్వడంలో ముందుంటుంది. దేశానికి ఈ రోజు గుర్తించుకోదగ్గ రోజు" అని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధానోవా మీడియాతో అన్నారు.
అవానీ జైపూర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. కాగా, తన పై అధికారులు తన సేవలను వినియోగించుకునే రీతిలో ఓ మంచి యుద్ధ పైలట్ కావాలన్నదే తన కల అని, అత్యుత్తమ యుద్ధ విమానాన్ని నడపాలని తాను కోరుకుంటున్నానని ఆమె ఇదివరకే తన మనసులోని మాటను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.