India: మేము ముందే ఊహించాం.. డుమిని - క్లాసన్ రాణించారు: విరాట్ కోహ్లీ
- ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయమనుకున్నా
- కానీ, పరిస్థితి పూర్తిగా మారిపోయింది
- దక్షిణాఫ్రికా జట్టు సమష్టిగా రాణించి విజయం సాధించింది : కోహ్లీ
సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, రెండో టీ20లో దక్షిణాఫ్రికా జట్టు నుంచి తీవ్రమైన పోరు ఎదురవుతుందని తాము ముందే ఊహించామని, ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులని అన్నాడు. నిన్న జరిగిన కీలక మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు సమష్టిగా రాణించి విజయం సాధించిందని ప్రశంసించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు మొదట్లోనే కీలక వికెట్లు పోగొట్టుకుందని, ఆ తర్వాత బరిలోకి దిగిన రైనా, మనీశ్ పాండే బాగా ఆడారని అన్నాడు. టీమిండియా 175 పరుగులు చేస్తుందేమోనని అనుకున్నాం కానీ, ధోనీ-మనీశ్ పాండే అద్భుతమైన ఆట తీరుతో 188 పరుగులు చేయగలిగామని అన్నారు.
ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ఖాయమనే భావించామని కానీ, ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా వర్షం చినుకులు పడటంతో టీమిండియా బౌలర్లు కొంచెం ఇబ్బందిపడ్డారని, అదే సమయంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ డుమిని, క్లాసన్ రాణించారని ప్రశంసించాడు. కాగా, మూడు టీ20ల సిరీస్ లో చివరి మ్యాచ్ ఈ నెల 24న జరగనుంది.