Rohit Sharma: కోహ్లీ ఎలా చెబితే అలా చేస్తాం: విశ్రాంతిపై బీసీసీఐ
- విశ్రాంతి కావాలో వద్దో అతని ఇష్టమే
- వచ్చే నెలలో లంకలో ముక్కోణపు సిరీస్‌కి టీమిండియా
- భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్!
దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత ఒకవేళ తనకు విశ్రాంతి కావాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ కోరితే దాని గురించి తప్పక ఆలోచిస్తామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. విశ్రాంతి వద్దని అతను చెప్పినా అది కూడా తమకు సమ్మతమేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే క్రికెట్‌కు దూరంగా ఉండలేనని కోహ్లీ పలుమార్లు వెల్లడించిన నేపథ్యంలో అతను విరామం తీసుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.
దక్షిణాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత టీమిండియా శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న ముక్కోణపు టీ-20 సిరీస్‌కు బయలుదేరనుంది. శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీ బిజీ అవుతారని ఆయన చెప్పారు. మరోవైపు భువనేశ్వర్ కుమార్, బుమ్రాలకు లంక సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావిస్తోంది. కానీ తుది జట్టులో ఎవరెవరుంటారో తెలియాలంటే మరో వారం వరకు ఆగాల్సిందే.
ఎందుకంటే, ఈ సిరీస్‌లో ఆడే తుది జట్టును సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్కే ప్రసాద్ ఈ వారాంతంలో కోహ్లీతో చర్చించి ప్రకటించే అవకాశముంది. భారత్-బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు టీ-20 సిరీస్ వచ్చే నెల 6న మొదలై 18తో ముగుస్తుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతుంది. అందువల్ల పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు ఉంటుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నీ డే-నైట్ మ్యాచ్‌లే.