Supreme Court: మేజర్ అయిన వ్యక్తి తన నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు: కేరళ 'లవ్ జిహాద్' కేసుపై సుప్రీంకోర్టు
- కేరళ 'లవ్ జిహాద్' కేసులో సుప్రీంకోర్టులో విచారణ
- వివాహం విషయంలో మంచి, చెడులను కూడా కోర్టు చెప్పలేదు
- సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోలేదనే కారణంతో పెళ్లిని రద్దు చేయలేం
ఓ వ్యక్తి తన భాగస్వామి ఎంపిక విషయంలో కోర్టు న్యాయం చెప్పలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేరళ ‘లవ్ జిహాద్’ కేసుపై విచారణ జరుపుతోన్న అత్యున్నత న్యాయస్థానం.. మేజర్ అయిన వ్యక్తి తన నిర్ణయం ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే వివాహం విషయంలో మంచి, చెడులను సైతం కోర్టు చెప్పలేదని తెలిపింది. ఒక యువతి లేక యువకుడు తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న యువకుడు లేక యువతిని సరిగ్గానే ఎంపిక చేసుకున్నారా? లేదా? వంటి విషయాలను తాము తీర్మానించలేమని స్పష్టం చేసింది.
అలాగే సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోలేదనే కారణంతో వారి పెళ్లిని రద్దు చేయలేమని వ్యాఖ్యానించింది. హదియా అనే అమ్మాయి ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి చెల్లదని గతేడాది కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ అమ్మాయి తన ఇష్టప్రకారమే ఇలా చేశానని చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టి ఇలా పేర్కొంది. కాగా, ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.