coffee: కాఫీ ప్రియులకు శుభవార్త... రోజూ మూడు కప్పుల కాఫీ లాగించేయొచ్చు!: పరిశోధన ఫలితం
- రోజూ మూడు కప్పుల కాఫీ రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది
- కాలేయం పనితీరు మెరుగుపడుతుంది
- జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తగ్గే అవకాశం
కాఫీ ప్రియులకు శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రాన్స్ అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థకు చెందిన పరిశోధకులు కాఫీ తాగడం వల్ల సంభవించే పరిణామాలపై 16 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనను 10 యూరోపియన్ దేశాల్లో సుమారు 5 లక్షల మందిపై చేశారు. ఇందులో రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం వలన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని గుర్తించారు. అలాగే కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కూడా కాఫీ అలవాటు సహాయపడుతుందని వారు తెలిపారు.
కాఫీలో కెఫిన్ ఉన్నప్పటికీ శారీక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపడం లేదని వారు వెల్లడించారు. అంతేకాకుండా కాఫీ తాగని వారితో పోలిస్తే సాధారణంగా వచ్చే నొప్పులు కూడా కాఫీ తాగే వారిలో తక్కువగా ఉన్నాయని వారు గుర్తించారు. రోజూ మూడుకప్పుల కాఫీ తాగడం వలన ఎలాంటి కారణం లేకుండా వచ్చే మరణాలు కూడా తగ్గే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ కాఫీ అలవాటు వల్ల రక్తప్రసరణ వ్యవస్థలో ఎలాంటి వ్యాధులు రావని, జీర్ణ సంబంధ వ్యాధులు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఫ్రాన్స్ అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థలోని పోషకాలు, జీర్ణ క్రియ విభాగం ఛీప్ లియోన్ వెల్లడించారు.