kenya: కెన్యా క్రికెట్లో భారీ కుదుపు.. కెప్టెన్, కోచ్, బోర్డు అధ్యక్షుడు రాజీనామా!
- కెన్యాను వేధిస్తున్న వరుస వైఫల్యాలు
- ప్రపంచకప్‌కు అర్హత కోల్పోయిన కెన్యా
- నైతిక బాధ్యత వహిస్తూ పలువురి రాజీనామా
- ప్రశ్నార్థకంగా కెన్యా క్రికెట్ భవితవ్యం
కెన్యా క్రికెట్లో భారీ సంక్షోభం నెలకొంది. నమీబియాలో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో కెన్యా జట్టు ఘోర ప్రదర్శన చివరికి ఆ దేశ క్రికెట్‌ను సంక్షోభంలోకి నెట్టేసింది. కెప్టెన్, కోచ్, బోర్డు అధ్యక్షుడు సహా పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ టోర్నీలో కెన్యా జట్టు చివరి స్థానంలో నిలిచిన తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు గత నెలలో జింబాబ్వేతో జరిగిన ప్రపంచకప్ క్వాలిఫై మ్యాచ్‌లోనూ కెన్యా జట్టు చిత్తుగా ఓడి ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయింది.
జట్టు చెత్త ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్ రాకెప్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు. అతడి కంటే ముందే క్రికెట్ కెన్యా అధ్యక్షురాలు జాకీ జాన్మొహమ్మద్, కోచ్ థామస్ ఒడోయో, బోర్డు డైరెక్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అభిజిత్ సర్కార్లు వరుసపెట్టి రాజీనామాలు చేశారు. ఫలితంగా కెన్యన్ క్రికెట్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. జాన్మొహమ్మద్ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే క్రికెట్ బోర్డు తొలి మహిళా అధ్యక్షురాలు. ప్రపంచ క్రికెట్లో సరైన గుర్తింపు కోసం తహతహలాడుతున్న కెన్యన్ క్రికెట్‌కి తాజా పరిణామాలు శరాఘాతంగా మారాయి. కాగా, తాజా సంక్షోభం నేపథ్యంలో 30 రోజుల్లో బోర్డులో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.