Tirumala: భారీగా పెరగనున్న తిరుమల సేవా టికెట్ల ధరలు... ఇకపై అడిగినన్ని లడ్డూలు కూడా!
- సుప్రభాత సేవకు రూ. 120 మాత్రమే
- తోమాల, అర్చన సేవలకు రూ. 200
- ఈ సేవల్లో తనివితీరా స్వామి దర్శనం
- రూ. 300 చెల్లిస్తే, దూరం నుంచి సెకను మాత్రమే
- ధరల్లో హేతుబద్ధత తెచ్చేలా టీటీడీ నివేదిక
దాదాపు అరగంట పాటు దేవదేవుని ఎదుట నిలబడే అవకాశాన్ని కల్పించే సుప్రభాత సేవకు చెల్లించాల్సింది రూ. 120. మూలవిరాట్టు ముందు అంతే సేపు కూర్చుని స్వామిని కనులారా తిలకించే అవకాశాన్ని కల్పించే తోమాల సేవ, అర్చన టికెట్లకు ధర రూ. 220. అదే రూ. 300 చెల్లించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కొనుగోలు చేస్తే, మహాలఘు స్థానం నుంచి రెప్పపాటు సమయం మాత్రమే దర్శనం లభిస్తుంది. ఇక విజయవాడ, శ్రీశైలం దేవాలయాల్లో అభిషేకం టికెట్ ధరతో పోలిస్తే, తిరుమల వెంకన్న అభిషేకం ధర చాలా తక్కువ. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల విషయంలో ధరల హేతుబద్ధత లేదనే వాదన వినిపిస్తుండగా, మార్చి 1 నుంచి సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాలని టీటీడీ భావిస్తోంది. ఇప్పటికే అధికారులు ధరలను పెంచే విషయమై నివేదికను సిద్ధం చేశారు కూడా. ఆర్జిత సేవలతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ధరలను పెంచాలన్నది ఈ రిపోర్టు సారాంశం.
ఇక లడ్డూల విక్రయంలో దళారుల పాత్రకు అడ్డుకట్ట వేయడంలో నిఘా అధికారులు విజయం సాధించడంతో టీటీడీ సఫలం కాగా, రోజువారీ విక్రయానికి తయారవుతున్న లడ్డూలు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడటంతో భక్తులకు ఇకపై అడిగినన్ని లడ్డూలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఇప్పటివరకూ భక్తులకు పరిమితంగా మాత్రమే లడ్డూలను అందిస్తుండగా, వారం రోజుల్లో 15 వేల వరకూ లడ్డూలు మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం రోజుకు 3.50 లక్షల వరకూ లడ్డూలను టీటీడీ తయారు చేస్తుండగా, గరిష్ఠంగా భక్తుడికి 10 లడ్డూల చొప్పున అందిస్తున్నా, లడ్డూలు మిగులుతుండటంతో కోరినన్ని లడ్డూలు ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని టీటీడీ భావిస్తోంది. ఆర్జిత సేవల పెంపు, కోరినన్ని లడ్డూల విషయంలో అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది.
ప్రస్తుతం ఆర్జిత సేవా టికెట్ల ధర, ప్రతిపాదిత ధరల వివరాలు...
సేవ పేరు | ప్రస్తుతం సాధారణ కోటా | ప్రస్తుతం విచక్షణ కోటా | ప్రతిపాదిత సాధారణ కోటా | ప్రతిపాదిత విచక్షణ కోటా |
సుప్రభాతం | 120 | 240 | 400 | 800 |
తోమాల | 220 | 440 | 1000 | 2000 |
అర్చన | 220 | 440 | 1000 | 2000 |
అష్టదళం పాదపద్మారాధన | 1,250 | 1,250 | 1,250 | 2,000 |
సహస్ర కలశాభిషేకం | 850 | 850 | 850 | 1500 |
తిరుప్పావడ | 850 | 850 | 850 | 1500 |
వస్త్రాలంకరణ | 12,500 | 50,000 | 25,000 | 50,000 |
అభిషేకం | 750 | 2,500 | 2,000 | 4,000 |
నిజపాద దర్శనం | 200 | 200 | 500 | 1,000 |
కల్యాణోత్సవం | 1000 | 1000 | 1000 | 1000 |
ఊంజల్ సేవ | 200 | -- | 500 | -- |
ఆర్జిత బ్రహ్మోత్సవం | 200 | -- | 500 | -- |
వసంతోత్సవం | 300 | -- | 500 | -- |
సహస్ర దీపాలంకారం | 200 | -- | 200 | -- |
విశేష పూజ | 600 | -- | 600 | -- |